Lumina
Psalms

Fret Not Thyself

Psalms 37·Telugu Bible

1చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము.

2వారు గడ్డివలెనే త్వరగా ఎండిపోవుదురు. పచ్చని కూరవలెనే వాడిపోవుదురు

3యెహోవాయందు నమి్మకయుంచి మేలుచేయుము దేశమందు నివసించి సత్యము ననుసరించుము

4యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.

5నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును.

Psalms 37 illustration - Psalms Chapter 37

6ఆయన వెలుగునువలె నీ నీతిని మధ్యాహ్నమునువలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును.

7యెహోవా యెదుట మౌనముగానుండి ఆయనకొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్థిల్లువాని చూచి వ్యసనపడకుము దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసన పడకుము.

8కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము

9కీడు చేయువారు నిర్మూలమగుదురు యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు.

10ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు.

Psalms 37 illustration - Psalms Chapter 37

11దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు

12భక్తిహీనులు నీతిమంతులమీద దురాలోచన చేయుదురు వారినిచూచి పండ్లు కొరుకుదురు.

13వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచు చున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు.

14దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించువారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కు పెట్టి యున్నారు

15వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరువబడును.

Psalms 37 illustration - Psalms Chapter 37

16నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధనసమృద్ధికంటె శ్రేష్టము.

17భక్తిహీనుల బాహువులు విరువబడును నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు

18నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును.

19ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు కరవు దినములలో వారు తృప్తిపొందుదురు.

20భక్తిహీనులు నశించిపోవుదురు యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలి యుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలె కనబడకపోవుదురు.

Psalms 37 illustration - Psalms Chapter 37

21భక్తిహీనులు అప్పుచేసి తీర్చకయుందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు.

22యెహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు ఆయన శపించినవారు నిర్మూలమగుదురు.

23ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును.

24యెహోవా అతని చెయ్యి పట్టుకొని యున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక యుండడు.

25నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు.

Psalms 37 illustration - Psalms Chapter 37

26దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపువారు ఆశీర్వదింపబడుదురు.

27కీడు చేయుట మాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు

28ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్న టెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును.

29నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.

30నీతిమంతుల నోరు జ్ఞానమునుగూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును.

Psalms 37 illustration - Psalms Chapter 37

31వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు జారవు.

32భక్తిహీనులు నీతిమంతులకొరకు పొంచియుండి వారిని చంపజూతురు.

33వారిచేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషు లుగా ఎంచడు.

34యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము ఆయన మార్గము ననుసరించుము భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు.

35భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి యుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలె వాడు వర్ధిల్లి యుండెను.

Psalms 37 illustration - Psalms Chapter 37

36అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను.

37నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలువకుండ అపరాధులు నశించుదురు

38భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము

39బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యెహోవా శరణుజొచ్చి యున్నారు గనుక

40ఆయన భక్తిహీనుల చేతిలోనుండి వారిని విడిపించి రక్షించును.

Chapter Complete

You have read Psalms 37

40 verses