1యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము నా మొఱ్ఱ నీయొద్దకు చేరనిమ్ము.
2నా కష్టదినమున నాకు విముఖుడవై యుండకుము నాకు చెవియొగ్గుము నేను మొరలిడునాడు త్వరపడి నాకుత్తర మిమ్ము.
3పొగ యెగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవు చున్నవి పొయిలోనిది కాలిపోయినట్లు నా యెముకలు కాలి పోయి యున్నవి.
4ఎండదెబ్బకు వాడిన గడ్డివలె నా హృదయము వాడి పోయి యున్నది భోజనము చేయుటకే నేను మరచిపోవు చున్నాను.
5నా మూల్గుల శబ్దమువలన నా యెముకలు నా దేహ మునకు అంటుకొని పోయినవి.

6నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను పాడైన స్థలములలోని పగిడికంటెవలె నున్నాను.
7రాత్రి మెలకువగా నుండి యింటిమీద ఒంటిగా నున్న పిచ్చుకవలె నున్నాను.
8దినమెల్ల నా శత్రువులు నన్ను నిందించుచున్నారు నామీద వెఱ్ఱికోపముగలవారు నా పేరు చెప్పి శపిం తురు.
9నీ కోపాగ్నినిబట్టియు నీ ఆగ్రహమునుబట్టియు బూడిదెను ఆహారముగా భుజించుచున్నాను.
10నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొను చున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసియున్నావు.

11నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి గడ్డివలె నేను వాడియున్నాను.
12యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు నీ నామస్మరణ తరతరము లుండును.
13నీవు లేచి సీయోనును కరుణించెదవు. దానిమీద దయచూపుటకు కాలము వచ్చెను నిర్ణయకాలమే వచ్చెను.
14దాని రాళ్లు నీ సేవకులకు ప్రియములు వారు దాని మంటిని కనికరించుదురు
15అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరు నీ మహిమకును భయపడెదరు

16ఏలయనగా యెహోవా సీయోనును కట్టియున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను
17ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనవైపు తిరిగియున్నాడు.
18యెహోవాను సేవించుటకై జనములును రాజ్యములును కూర్చబడునప్పుడు
19మనుష్యులు సీయోనులో యెహోవా నామఘనతను యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించు నట్లు
20చెరసాలలో ఉన్నవారి మూల్గులను వినుటకును చావునకు విధింపబడినవారిని విడిపించుటకును

21ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయమునుండి వంగి చూచెననియు ఆకాశమునుండి భూమిని దృష్టించెననియు
22వచ్చుతరము తెలిసికొనునట్లుగా ఇది వ్రాయబడ వలెను సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును
23నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నాబలము క్రుంగజేసెను నా దినములు కొద్దిపరచెను.
24నేనీలాగు మనవిచేసితిని నా దేవా, నాదినముల మధ్యను నన్ను కొనిపోకుము నీ సంవత్సరములు తరతరములుండును.
25ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడ నీ చేతిపనులే.

26అవి నశించును గాని నీవు నిలచియుందువు అవియన్నియు వస్త్రమువలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును.
27నీవు ఏకరీతిగా నుండువాడవు నీ సంవత్సరములకు అంతము లేదు.
28నీ సేవకుల కుమారులు నిలిచియుందురు వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును.
You have read Psalms 102
28 verses