Lumina
Ezekiel

Lament for Pharaoh

Ezekiel 32·Telugu Bible

1మరియు పండ్రెండవ సంవత్సరము పండ్రెండవనెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2నరపుత్రుడా, ఐగుప్తురాజైన ఫరోనుగూర్చి అంగలార్పు వచనమెత్తి అతనికి ఈ మాట ప్రకటింపుముజనములలో కొదమ సింహమువంటివాడ వని నీవు ఎంచబడితివి, జలములలో మొసలివంటివాడవై నీ నదులలో రేగుచు నీ కాళ్లతో నీళ్లు కలియబెట్టితివి, వాటి వాగులను బురదగా చేసితివి.

3ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలను నీమీద వేయగా వారు నా వలలో చిక్కిన నిన్ను బయటికి లాగెదరు.

4నేను నిన్ను నేల పడవేసి తెరపనేలమీద పారవేసెదను, ఆకాశపక్షులన్నియు నీమీద వ్రాలునట్లుచేసి నీవలన భూజంతువులన్నిటిని కడుపార తిననిచ్చెదను,

5​నీ మాంస మును పర్వతములమీద వేసెదను, లోయలన్నిటిని నీ కళే బరములతో నింపెదను.

Ezekiel 32 illustration - Ezekiel Chapter 32

6మరియు భూమిని నీ రక్తధార చేత పర్వతములవరకు నేను తడుపుదును, లోయలు నీతో నింపబడును.

7​నేను నిన్ను ఆర్పివేసి ఆకాశమండలమును మరుగు చేసెదను, నక్షత్రములను చీకటి కమ్మజేసెదను, సూర్యుని మబ్బుచేత కప్పెదను, చంద్రుడు వెన్నెల కాయకపోవును.

8నిన్నుబట్టి ఆకాశమందు ప్రకాశించు జ్యోతుల కన్నిటికిని అంధకారము కమ్మజేసెదను, నీ దేశము మీద గాఢాంధకారము వ్యాపింపజేసెదను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

9నీవు ఎరుగని దేశములలోనికి నేను నిన్ను వెళ్లగొట్టి, జనములలో నీకు సమూలధ్వంసము కలుగజేసి బహు జనములకు కోపము పుట్టింతును,

10నా ఖడ్గమును నేను వారిమీద ఝళిపించెదను, నిన్నుబట్టి చాలమంది జనులు కలవరించుదురు, వారి రాజులును నిన్నుబట్టి భీతులగుదురు, నీవు కూలు దినమున వారందరును ఎడతెగక ప్రాణభయముచేత వణకుదురు.

Ezekiel 32 illustration - Ezekiel Chapter 32

11ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాబబులోనురాజు ఖడ్గము నీమీదికి వచ్చును,

12శూరుల ఖడ్గములచేత నేను నీ సైన్య మును కూల్చెదను, వారందరును జనములలో భయంకరులు; ఐగుప్తీయుల గర్వము నణచివేయగా దాని సైన్య మంతయు లయమగును.

13మరియు గొప్పప్రవాహముల దరినున్న పశువులనన్నిటిని నేను లయపరచెదను, నరుని కాలైనను పశువుకాలైనను వాటిని కదలింపకయుండును.

14అప్పుడు నేను వాటి నీళ్లు తొణకకుండజేసి తైలము పారునట్లు వారి నదులను పారజేసెదను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

15నేను ఐగుప్తు దేశమును పాడు చేసి అందులోని సమస్తమును నాశనము చేసి దాని నివాసులనందరిని నిర్మూలముచేయగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

Ezekiel 32 illustration - Ezekiel Chapter 32

16ఇది అంగలార్పు వచనము, వారు దానిని యెత్తి పాడుదురు, అన్యజనుల కుమార్తెలు దానిని యెత్తి పాడుదురు; ఐగుప్తును గూర్చియు అందులోని సమూహమును గూర్చియు ఆ వచనమెత్తి వారు పాడుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

17పండ్రెండవ సంవత్సరము నెల పదునైదవ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెల విచ్చెను

18నరపుత్రుడా, అల్లరిచేయు ఐగుప్తీయుల సమూహమునుగూర్చి అంగలార్చుము, ప్రసిద్ధినొందిన జన ముల కుమార్త్తెలు భూమిక్రిందికి దిగిపోయినట్లు భూమి క్రిందికిని పాతాళమునకు పోయిన వారి యొద్దకును వారిని పడవేయుము.

19సౌందర్యమందు నీవు ఎవనిని మించిన వాడవు?దిగి సున్నతి నొందని వారియొద్ద పడియుండుము.

20ఖడ్గముచేత హతమైన వారిమధ్య వారు కూలుదురు, అది కత్తిపాలగును, దానిని దాని జనులను లాగి పడవేయుడి.

Ezekiel 32 illustration - Ezekiel Chapter 32

21వారు దిగిపోయిరే, సున్నతినొందని వీరు ఖడ్గముచేత హతమై అక్కడ పడియుండిరే, అని యందురు; పాతాళ ములోనున్న పరాక్రమశాలురలో బలాఢ్యులు దాని గూర్చియు దాని సహాయులనుగూర్చియు అందురు.

22అష్షూరును దాని సమూహమంతయు అచ్చటనున్నవి, దాని చుట్టును వారి సమాధులున్నవి, వారందరు కత్తిపాలై చచ్చి యున్నారు.

23దాని సమాధులు పాతాళాగాధములో నియమింపబడినవి, దాని సమూహము దాని సమాధిచుట్టు నున్నది, వారందరు సజీవుల లోకములో భయంకరులైన వారు, వారు కత్తిపాలై చచ్చిపడియుండిరి.

24అక్కడ ఏలామును దాని సమూహమును సమాధిచుట్టు నున్నవి; అందరును కత్తిపాలై చచ్చిరి; వారు సజీవులలోకములో భయంకరులైనవారు, వారు సున్నతిలేనివారై పాతాళములోనికి దిగిపోయిరి, గోతిలోనికి దిగిపోయినవారితో కూడ వారు అవమానము నొందుదురు.

25హతులైన వారిమధ్య దానికిని దాని సమూహమునకును పడకయొకటి ఏర్పడెను, దాని సమాధులు దానిచుట్టు నున్నవి; వారందరును సున్నతి లేనివారై హతులైరి; వారు సజీవులలోకములో భయం కరులు గనుక గోతిలోనికి దిగిపోయినవారితో కూడ వారును అవమానము నొందుదురు, హతులైన వారిమధ్య అది యుంచబడును.

Ezekiel 32 illustration - Ezekiel Chapter 32

26అక్కడ మెషెకును తుబాలును దాని సమూహమును ఉన్నవి; దాని సమాధులు దాని చుట్టునున్నవి. వారందరు సున్నతిలేనివారు, సజీవుల లోకములో వారు భయంకరులైరి గనుక వారు కత్తిపాలైరి, ఆయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగి పోయిరి.

27అయితే వీరు సున్నతిలేని వారిలో పడిపోయిన శూరులదగ్గర పండుకొనరు; వారు తమ యుధ్దాయుధము లను చేతపట్టుకొని పాతాళములోనికి దిగిపోయి, తమ ఖడ్గములను తలల క్రింద ఉంచుకొని పండుకొందురు; వీరు సజీవుల లోకములో భయంకరులైరి గనుక వారి దోషము వారి యెముకలకు తగిలెను.

28​నీవు సున్నతిలేనివారి మధ్య నాశనమై కత్తిపాలైనవారియొద్ద పండుకొందువు.

29అక్కడ ఎదోమును దాని రాజులును దాని అధిపతు లందరును ఉన్నారు; వారు పరాక్రమవంతులైనను కత్తి పాలైన వారియొద్ద ఉంచబడిరి; సున్నతిలేని వారియొద్దను పాతాళములోనికి దిగిపోయినవారియొద్దను వారును పండు కొనిరి.

30అక్కడ ఉత్తరదేశపు అధిపతులందురును సీదో నీయులందరును హతమైన వారితో దిగిపోయియున్నారు; వారు పరాక్రమవంతులై భయము పుట్టించినను అవమానము నొందియున్నారు; సున్నతి లేనివారై కత్తిపాలైన వారిమధ్య పండుకొనియున్నారు; గోతిలోనికి దిగిపోయిన వారితోపాటు వారును అవమానము నొందుదురు.

Ezekiel 32 illustration - Ezekiel Chapter 32

31కత్తిపాలైన ఫరోయు అతనివారందరును వారినిచూచి తమ సమూహమంతటినిగూర్చి ఓదార్పు తెచ్చుకొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

32సజీవుల లోకములో అతనిచేత భయము పుట్టించితిని గనుక ఫరోయు అతని వారందరును కత్తిపాలైనవారియొద్ద సున్నతిలేనివారితో కూడ పండుకొందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

Chapter Complete

You have read Ezekiel 32

32 verses