Lumina
1Samuel

David Saves Keilah

1Samuel 23·Telugu Bible

1తరువాత ఫిలిష్తీయులు కెయీలామీద యుద్ధము చేసి కల్లములమీది ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను.

2అంతట దావీదునేను వెళ్లి యీ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణచేయగా యెహోవానీవు వెళ్లి ఫిలిష్తీ యులను హతముచేసి కెయీలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను.

3దావీదుతో కూడియున్న జనులుమేము ఇచ్చట యూదా దేశములో ఉండినను మాకు భయముగా నున్నది; ఫిలిష్తీయుల సైన్యములకెదురుగా కెయీలాకు మేము వచ్చినయెడల మరింత భయము కలుగును గదా అని దావీదుతో అనగా

4దావీదు మరల యెహోవాయొద్ద విచారణ చేసెనునీవు లేచి కెయీలాకు వెళ్లుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవియ్యగా

5దావీదును అతని జనులును కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధముచేసి వారిని లెస్సగా హతముచేసి వారి పశువులను దోచుకొనివచ్చిరి. ఈలాగున దావీదు కెయీలా కాపురస్థులను రక్షించెను.

1Samuel 23 illustration - 1Samuel Chapter 23

6అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు ఏఫోదు చేత పట్టుకొని పారిపోయి కెయీలాలోనున్న దావీదునొద్దకు వచ్చెను.

7దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారములును అడ్డుగడలునుగల పట్టణములో ప్రవేశించి అందులో మూయబడి యున్నాడు, దేవుడతనిని నా చేతికి అప్పగించెనను కొనెను.

8కాబట్టి సౌలు కెయీలాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింప వలెనని జనులందరిని యుద్ధమునకు పిలువనంపించెను.

9సౌలు తనకు కీడే యుద్దేశించుచున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఏఫోదును తెమ్మనెను.

10అప్పుడు దావీదుఇశ్రాయేలీయుల దేవా యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్నుబట్టి పట్టణమును పాడుచేయ నుద్దేశించుచున్నాడని నీ దాసుడనైన నాకురూఢిగా తెలియబడి యున్నది.

1Samuel 23 illustration - 1Samuel Chapter 23

11కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడనైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దానిని తెలియజేయుమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను.

12కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరల మనవి చేయగా యెహోవావారు నిన్ను అప్ప గించుదురని సెలవిచ్చెను.

13​అంతట దావీదును దాదాపు ఆరువందల మందియైన అతని జనులును లేచి కెయీలాలో నుండి తరలి, ఎక్కడికి పోగలరో అక్కడకు వెళ్లిరి. దావీదు కెయీలాలోనుండి తప్పించుకొనిన సంగతి సౌలు విని వెళ్లక మానెను.

14​అయితే దావీదు అరణ్యములోని కొండస్థలముల యందును, జీఫు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను; సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలుచేతికి అతని నప్పగించలేదు.

15తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరెనని తెలిసికొని దావీదు జీఫు అరణ్యములో ఒక వనమున దిగెను.

1Samuel 23 illustration - 1Samuel Chapter 23

16అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి, వనము లోనున్న దావీదునొద్దకు వచ్చినా తండ్రియైన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు,

17నీవు ఇశ్రా యేలీయులకు రాజ వగుదువు, నేను నీకు సహకారినౌదును, ఇది నా తండ్రి యైన సౌలునకు తెలిసియున్నదని అతనితో చెప్పి దేవునిబట్టి అతని బలపరచెను.

18వీరిద్దరు యెహోవా సన్నిధిని నిబంధన చేసికొనిన తరువాత దావీదు వనములో నిలిచెను, యోనాతాను తన యింటికి తిరిగి వెళ్లెను.

19జీఫీయులు బయలుదేరి గిబియాలోనున్న సౌలునొద్దకు వచ్చియెషీమోనుకు దక్షిణమున నున్న హకీలామన్యము లోని అరణ్యమున కొండ స్థలములయందు మా మధ్య దావీదు దాగియున్నాడే.

20రాజా, నీ మనోభీష్టమంతటి చొప్పున దిగిరమ్ము; రాజవైన నీ చేతికి అతనిని అప్పగించుట మా పని అని చెప్పగా

1Samuel 23 illustration - 1Samuel Chapter 23

21సౌలు వారితో ఇట్లనెనుమీరు నాయందు కనికరపడినందుకై మీకు యెహోవా ఆశీర్వాదము కలుగును గాక.

22మీరు పోయి అతడు ఉండుస్థలము ఏదయినది, అతనిని చూచినవాడు ఎవడయినది నిశ్చయముగా తెలిసికొనుడి; అతడు బహు యుక్తిగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడెను గనుక

23మీరు బహు జాగ్రత్తగా నుండి, అతడుండు మరుగు తావులను కని పెట్టియున్న సంగతియంత నాకు తెలియజేయుటకై మరల నాయొద్దకు తప్పక రండి, అప్పుడు నేను మీతో కూడా వత్తును, అతడు దేశములో ఎక్కడనుండినను యూదావారందరిలో నేను అతని వెదకి పట్టుకొందును.

24అంతట వారు లేచి సౌలుకంటె ముందు జీఫునకు తిరిగి వెళ్లిరి. దావీదును అతని జనులును యెషీమోనుకు దక్షిణపు వైపుననున్న మైదానములోని మాయోను అరణ్యములో ఉండగా

25సౌలును అతని జనులును తన్ను వెదకుటకై బయలుదేరిన మాట దావీదు విని, కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసము చేసెను. సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరుమ బోయెను.

1Samuel 23 illustration - 1Samuel Chapter 23

26అయితే సౌలు పర్వతము ఈ తట్టునను దావీదును అతని జనులును పర్వతము ఆ తట్టునను పోవుచుండగా దావీదు సౌలుదగ్గరనుండి తప్పించుకొని పోవలెనని త్వరపడుచుండెను. సౌలును అతని జనులును దావీదును అతని జనులను పట్టుకొనవలెనని వారిని చుట్టు కొనుచుండిరి.

27ఇట్లుండగా దూత యొకడు సౌలునొద్దకు వచ్చినీవు త్వరగా రమ్ము, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశములో చొరబడియున్నారని చెప్పగా

28సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయెను. కాబట్టి సెలహమ్మలెకోతు1 అని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను.

29తరువాత దావీదు అక్కడనుండి పోయి ఏన్గెదీకి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను.

Chapter Complete

You have read 1Samuel 23

29 verses